
వక్ఫ్(సవరణ) చట్టంపై ఇక పిటిషన్లు స్వీకరించం
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఇక కొత్తగా పిటిషన్లు దాఖలైతే విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు కుండబద్ధలు కొట్టినట్లు తేల్చిచెప్పింది. పత్రికల్లో పేరు కోసం కొందరు ఇష్టానుసారంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో పేరు రావాలని కోరుకుంటున్నారని, అందుకే పిటిషన్లు అంటూ తమ సమయం వృథా చేస్తున్నారని మండిపడింది. మీడియాలో పబ్లిసిటీ కోసం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది.
వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా, వాటిని విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. ఆ రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్లు తెలియజేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కొత్తగా ఎవరూ వ్యాజ్యాలు దాఖలు చేయొద్దని పరోక్షంగా హెచ్చరించింది.