
సుప్రీంకోర్టు కీలక తీర్పు
అలా అనుమతులివ్వొద్దు
కేంద్రానికి లక్ష్మణరేఖ
ఉల్లంఘనులు నిరక్షరాస్యులేమీ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ గీసింది. మైనింగ్ తదితర ప్రాజెక్టులకు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశించింది. అలా అనుమతులిచ్చేందుకు వీలు కల్పిస్తూ 2017, 2021 ఉత్తర్వుల ఆధారంగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లు తదితరాలు అక్రమమని పేర్కొంటూ వాటన్నింటినీ కొట్టేసింది.
ఇకపై అలాంటి ఆదేశాలు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. అయితే ఆయా నోటిఫికేషన్ల ఆధారంగా ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులు మాత్రం చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతుల్లేకుండా మొదలైన ప్రాజెక్టులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకునేందుకు ఇకపై అవకాశముండదు.
కావాలనే ఉల్లంఘనలు
అత్యంత కీలకం, తప్పనిసరి అయిన పర్యావరణ అనుమతులను పట్టించుకోకపోవడం భారీ అవకతవకలకు పాల్పడటమే తప్ప మరోటి కాదని జస్టిస్ ఓకా ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఇలా చేస్తున్నవాళ్లు నిరక్షరాస్యులేమీ కారు. వారు కంపెనీలు, రియల్టీ డెవలపర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ పరిశ్రమల యజమానులు. వీళ్లంతా ఉద్దేశపూర్వకంగానే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న వాళ్లే’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఇలాంటి వాళ్లకు ఎలాంటి అనుచిత లబ్ధీ కలగడానికి అనుమతించేది లేదు. ఇలాంటి ప్రాజెక్టులకు అనంతర కాలంలో ఈసీలు ఇచ్చేలా 2017 నోటిఫికేషన్ల వంటివి ఇకపై జారీ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నిర్దేశాలు జారీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) నోటిఫికేషన్ (2006) ప్రకారం మైనింగ్‌తో పాటు ఎలాంటి భారీ ప్రాజెక్టులకైనా ముందుగా పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకోవడం తప్పనిసరి. అలాంటివేవీ లేకుండానే మొదలు పెడుతున్న ప్రాజెక్టులకు ఈసీల జారీని సవాలు చేస్తూ వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ ఉత్తర్వులు ఈఐఏ నోటిఫికేషన్‌కు విరుద్ధమేమీ కాదని, కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈసీలు ఇవ్వకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని కేంద్రం వాదించింది. పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనల మేరకే ఆ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.