
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.
ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.
పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.
దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.