
టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు
ఉద్యోగాలకు ఎంపికైనా కోర్టు కేసులతో కాలయాపన
న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ
తుది జాబితా ప్రకటించినా కోర్టు ఆదేశాలతో నిలుపుదల
తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం
గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్–2, గ్రూప్–3
వేసవి సెలవుల తర్వాత గ్రూప్–1పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే, ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ.. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమై న అంశాలు పెండింగ్‌లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్–1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైనా నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది.
తుది తీర్పు తర్వాతే ముందుకు...
గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్–1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించటంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపేసింది. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్–2, ఆ తర్వాత గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది.
ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్–1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుంది. తుది తీర్పు వచి్చన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికారవర్గాలు అంటున్నాయి.
కోర్టు కేసులతో..
గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్‌లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది.
అయితే, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది.
⇒ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కిందిస్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావిస్తోంది.
⇒ గతేడాది డిసెంబర్‌లో గ్రూప్–4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్లంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువస్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు.
⇒ ఈ నేపథ్యంలో గ్రూప్–1 తుది జాబితాను వేగంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు.
⇒ గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి లేదు.