సాక్షి, హైదరాబాద్: రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ రానున్నారు.
సిట్‌కు కేసీఆర్.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్.. తన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదు.
..హరీష్‌రావు ఆఫిడవిట్‌లో సిద్ధిపేట అడ్రస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్‌గా నందినగర్ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.


