హైదరాబాద్: దశాబ్దాలుగా ఆంకాలజీ రంగానికి అనేక సేవలందిస్తున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడిని... భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ వరించిన సందర్భంగా సింధు హాస్సిటల్స్ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్ ఆవరణలో ఈరోజు(శనివారం,జనవరి 31న) కన్నులపండువగా జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ నోరి సుదీర్ఘకాలంగా చేసిన సేవలను సింధు హాస్పిటల్స్‌లోని డాక్టర్లు, పరిశోధకులు, నిష్ణాతులైన పలువురు వైద్యప్రముఖులు ఆయనను ప్రస్తుతించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ రంగంలో చోటు చేసుకున్న పురోగతిని బాధితులకు అందేలా విశేష కృష్టి చేశారంటూ ఆయనను కొనియాడారు.
ఈ సందర్భంగా సింధు హాస్పిటల్స్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని వరించిన పద్మభూషణ్ పురస్కారం మొత్తం వైద్యరంగానికీ, భారతదేశంలోని డాక్టర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమ’ని తెలిపారు. ‘ఆ అద్భుతమైన వ్యక్తి తమతో కలిసి పనిచేస్తుండటం తమకూ, తమ సంస్థకూ గర్వకారణమ’ని పేర్కొన్నారు. డాక్టర్ నోరితో తనకు మూడు దశాబ్దాలకు పైబడిన ఆత్మీయబంధం ఉందనీ, దాదాపు 30 ఏళ్ల కిందట తాను తమ హెటెరో సంస్థను యూఎస్‌లో ప్రారంభించాలనుకున్న నాటి నుంచీ తమ స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతోందం’టూ ఈ సందర్భంగా తమ అనుబంధాన్ని డాక్టర్ పార్థసారథి గుర్తు చేసుకున్నారు. ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తమ సింధు హాస్పిటల్స్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేయడం తమకెంతో గర్వకారణమం’టూ ఆయన తన హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హెచ్‌ఆర్‌డీ బ్రాకీథెరపీ’ అని సంక్షిప్తంగా పిలిచే ‘హై డోస్–రేట్ బ్రాకీథెరపీ’ ప్రక్రియకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆద్యులు. గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్, మూత్రవిసర్జక వ్యవస్థ (యూరినరీ సిస్టమ్), ఛాతీ, తల–మెడ ప్రాంతాల్లో వచ్చే అనేక రకాల కేన్సర్లకు ఇదో ప్రభావంతమైన మంచి చికిత్స ప్రక్రియ.
ఈ వేడుకలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ‘మన సంస్థలోని నర్స్‌లూ, డాక్టర్లు, ఇతర సహాయ సిబ్బందినీ, వారి తాలూకు ఆ బృందస్ఫూర్తిని చూసినప్పుడు... నాకు వీళ్లందరూ ఓ హాస్పిటల్ సిబ్బందిలా కాకుండా పేషెంట్లను సంరక్షించే ఆపన్నహస్తాలుగా కనిపిస్తారు. పేషెంటుకూ... వ్యాధికీ మధ్య కవచంలా నిలబడి బాధితులను పూర్తిగా కోలుకునేలా చేస్తారు. పేషెంట్లను వారి ఉద్విగ్న స్థితి నుంచి ఉపశమనానికి తీసుకువస్తారు’ అంటూ వారి సేవలను కొనియాడారు.


