breaking news
Dattatreyudu Nori
-
డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి సింధు హాస్పిటల్స్ సత్కారం
హైదరాబాద్: దశాబ్దాలుగా ఆంకాలజీ రంగానికి అనేక సేవలందిస్తున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడిని... భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ వరించిన సందర్భంగా సింధు హాస్సిటల్స్ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్ ఆవరణలో ఈరోజు(శనివారం,జనవరి 31న) కన్నులపండువగా జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ నోరి సుదీర్ఘకాలంగా చేసిన సేవలను సింధు హాస్పిటల్స్‌లోని డాక్టర్లు, పరిశోధకులు, నిష్ణాతులైన పలువురు వైద్యప్రముఖులు ఆయనను ప్రస్తుతించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ రంగంలో చోటు చేసుకున్న పురోగతిని బాధితులకు అందేలా విశేష కృష్టి చేశారంటూ ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా సింధు హాస్పిటల్స్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని వరించిన పద్మభూషణ్ పురస్కారం మొత్తం వైద్యరంగానికీ, భారతదేశంలోని డాక్టర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమ’ని తెలిపారు. ‘ఆ అద్భుతమైన వ్యక్తి తమతో కలిసి పనిచేస్తుండటం తమకూ, తమ సంస్థకూ గర్వకారణమ’ని పేర్కొన్నారు. డాక్టర్ నోరితో తనకు మూడు దశాబ్దాలకు పైబడిన ఆత్మీయబంధం ఉందనీ, దాదాపు 30 ఏళ్ల కిందట తాను తమ హెటెరో సంస్థను యూఎస్‌లో ప్రారంభించాలనుకున్న నాటి నుంచీ తమ స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతోందం’టూ ఈ సందర్భంగా తమ అనుబంధాన్ని డాక్టర్ పార్థసారథి గుర్తు చేసుకున్నారు. ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తమ సింధు హాస్పిటల్స్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేయడం తమకెంతో గర్వకారణమం’టూ ఆయన తన హర్షాన్ని వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హెచ్ఆర్డీ బ్రాకీథెరపీ’ అని సంక్షిప్తంగా పిలిచే ‘హై డోస్–రేట్ బ్రాకీథెరపీ’ ప్రక్రియకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆద్యులు. గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్, మూత్రవిసర్జక వ్యవస్థ (యూరినరీ సిస్టమ్), ఛాతీ, తల–మెడ ప్రాంతాల్లో వచ్చే అనేక రకాల కేన్సర్లకు ఇదో ప్రభావంతమైన మంచి చికిత్స ప్రక్రియ.ఈ వేడుకలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ‘మన సంస్థలోని నర్స్లూ, డాక్టర్లు, ఇతర సహాయ సిబ్బందినీ, వారి తాలూకు ఆ బృందస్ఫూర్తిని చూసినప్పుడు... నాకు వీళ్లందరూ ఓ హాస్పిటల్ సిబ్బందిలా కాకుండా పేషెంట్లను సంరక్షించే ఆపన్నహస్తాలుగా కనిపిస్తారు. పేషెంటుకూ... వ్యాధికీ మధ్య కవచంలా నిలబడి బాధితులను పూర్తిగా కోలుకునేలా చేస్తారు. పేషెంట్లను వారి ఉద్విగ్న స్థితి నుంచి ఉపశమనానికి తీసుకువస్తారు’ అంటూ వారి సేవలను కొనియాడారు. -
పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి..
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్/కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ మరణ శాసనం కాదు... సరైన సమయంలో గుర్తిస్తే ఆ మహమ్మారిని జయించవచ్చని నిరూపించి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగుతేజం, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. వైద్య విభాగంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడును పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. దీంతో ఆయన చిన్న వయసు నుంచి నడయాడిన కృష్ణాజిల్లా మచిలీపట్నం, మంటాడ, తోట్లవల్లూరు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.నోరి దత్తాత్రేయుడు మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించారు. తల్లిదండ్రులు కనకదుర్గ, సత్యనారాయణ. జిల్లాలోని తోట్లవల్లూరులో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉన్నత, పీయూసీ, బీఎస్సీ విద్యను మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్, ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తిచేశారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఆయన... ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. 1962లో ప్రీ–యూనివర్సిటీ, 1965లో బీఎస్సీ, ఉస్మానియాలో ఎండీ చేసినప్పుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు.ఫిబ్రవరి 1972 నుంచి ఏడాదిపాటు గాంధీ ఆస్పత్రిలో పనిచేశారు. 1973 నుంచి 1976 వరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడైన నోరి దత్తాత్రేయుడు నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అనంతరం.. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్ ఆంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి నాలుగు పుస్తకాలు, 200లకు పైగా పేపర్ ప్రజెంటేషన్లు చేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ప్రెస్ బైటేరియన్ హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ అవార్డులు.. క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టడంలో నోరి దత్తాత్రేయుడు కీలకపాత్ర పోషించి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీలో రేడియేషన్ మోతాదును అత్యంత కచి్చతంగా లెక్కించడం కోసం బ్రాకీ థెరపీని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన అనేక క్లినికల్ ట్రయల్స్‌కు ఆయన ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. ఆయన మెమోరియల్ స్లోన్–కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ అలూమ్ని సొసైటీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందారు.సలహాదారునిగా నియమించిన జగన్ సర్కార్ క్యాన్సర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టిన గత వైఎస్ జగన్ ప్రభుత్వం డాక్టర్ నోరిని సలహాదారునిగా నియమించింది. ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా 2021లో నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రూపకల్పన, అమలులో డాక్టర్ నోరి సలహాలు, సూచనలు ఇచ్చారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే మరణాలు, వ్యాధి భారాన్ని నియంత్రించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఆయన సలహాదారునిగా ఉన్నారు.నోరి దత్తాత్రేయుడు అందుకున్న అవార్డులు⇒ 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డు ఇచ్చారు. ⇒ 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ⇒ 1994లో అలూమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్–కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డు అందుకున్నారు. ⇒ 2000లో ఇప్పటివరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషన్ వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడీస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ డాక్టర్‌గా ఎంపిక. ⇒ 2014లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం.. ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్. ⇒ 2015లో భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ ⇒ 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ⇒ 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు. ⇒ అనేక ఏళ్లుగా అమెరికాలో క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న ఉన్నత సేవలకుగాను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నోరి దత్తాత్రేయుడికి ‘ట్రిబ్యూట్ టు లైఫ్’ గౌరవంతో సత్కరించింది. ⇒ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి బసవతారకం, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటి ప్రముఖులకు నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పద్మభూషణ్ రావడంపట్ల కేఎంసీ పూర్వ విద్యార్థులు, వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. -
వైద్యారోగ్యశాఖ మంత్రి రజనిని కలిసిన డా.నోరి దత్తాత్రేయుడు
-
కేన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చు: దత్తాత్రేయుడు
బంజారాహిల్స్ (హైదరాబాద్): కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరీ దత్తాత్రేయుడు తెలిపారు. ఆదివారం ఫిలింనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విస్తా ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు.. నోరి దత్తాత్రేయుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. మదర్స్ డే సందర్భంగా స్పెషల్ కూపన్‌ను ఆయన విడుదల చేశారు. -
కేన్సర్ పరీక్షను తప్పనిసరి చేయాలి
ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్రాత్రేయుడు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రోజూ దాదాపు 200 మంది మహిళల మృతికి కారణమవుతున్న గర్భాశయ ముఖద్వార కేన్సర్ నియంత్రణకు ముందస్తు పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ వైద్య నిపుణుడు, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ ట్రస్టీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. పాతికేళ్లు పైబడ్డ ప్రతి మహిళ ఏ కారణంతో ఆసుపత్రిలో చేరినా గర్భాశయ ముఖద్వార కేన్సర్ గుర్తింపు పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా అమెరికాలో కేన్సర్ మరణాల రేటును గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ రకమైన కేన్సర్ నివారణకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు. ‘ప్రివెన్షన్ ఇంటర్నేషనల్’ అనే సంస్థతో కలిసి తొలిదశలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.


