
ఇంట్లోని గదులలో ఎక్కువగా సమయం గడిపేది లివింగ్ రూమ్‌లోనే.. అందుకే చాలా మంది ఈ గదికి ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయిస్తుంటారు. అయితే కరోనా తర్వాతి నుంచి ఇంటి స్వరూపం మారిపోయింది. కొనుగోలుదారుల అభిరుచులలో మార్పులు వచ్చాయి. దీంతో లివింగ్ రూమ్ విస్తీర్ణానికి కోత పెట్టి మాస్టర్ బెడ్ రూమ్, పిల్లల గదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే బంధువులెవరైనా వచ్చినప్పుడు లివింగ్ రూమ్ చిన్నగా అనిపిస్తుందనే భావన నివాసితులకు కలుగుతుంది. అసలు లివింగ్ రూమ్‌లోని గోడలను అవసరం ఉన్నప్పుడు అటుఇటుగా కదిలించుకునే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుంది కదూ. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ తరహా సాంకేతికత ఇప్పుడిప్పుడే మన దేశంలోకి ప్రవేశిస్తుంది. హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లలో కనిపించే ఈ కదిలే గోడలు క్రమంగా గృహాల్లోకి వచ్చేశాయి. – సాక్షి, సిటీబ్యూరో
రోజురోజుకు ఇళ్ల ధరలు పెరిగిపోతుండటంతో రూ.80 లక్షలకు పైగా వెచ్చిస్తే తప్ప 3 బీహెచ్‌కే ఫ్లాట్ దొరకని పరిస్థితి. ఇంటిలో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగ్గుట్టుగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. గోడలు అనగానే ఇటుకలు, సిమెంట్ బ్లాక్స్‌తో కట్టేవే గుర్తుకొస్తాయి. ఇంటి లోపల ఇవే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి. వీటి స్థానంలో బిల్డర్లు ప్యానల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందం ఉండటంతో పాటు పటిష్టంగా, ఎక్కువకాలం మన్నికతో ఉంటాయి.
💠 ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ఎలాగూ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు స్థిరంగా ఉండే బదులు కదిలేలా ఉంటే ఇంట్లో స్థలాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్‌లోనూ ఈ కదిలే గోడలను వినియోగిస్తున్నారు.
💠 చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్‌ను పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్‌లో కలిసిపోయి ఉంటాయి కాబట్టి నివాసితులు చెబితే తప్ప ఎవరూ ఇవి కదిలే గోడలని గుర్తించలేరు. స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కదిలే గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయం సమయంలో బెడ్‌ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్ ప్యానెల్స్ రూ.75–80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి.