
సాక్షి, అమరావతి : కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు కేటాయించాలని మునిసిపల్ కమిషనర్‌ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు సురేష్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు.
వర్ధిని కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్‌బాబు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.
న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడువునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్‌బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.