
PC: IPl.com
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి ప్రారంభానికి సిద్దమైంది. శనివారం(మే 17) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ పునఃప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో అగ్రస్థానానికి ప్రమోట్ చేయాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరాణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని హెడ్ కోచ్ హేమంగ్ బదాని, మెంటార్ కెవిన్ పీటర్సన్ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.
మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రాహుల్ ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది సీజన్‌లో రాహుల్ 10 మ్యాచ్‌లలో ఆడాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. రెండు సార్లు మూడో స్ధానంలో, మిగిలిన మ్యాచ్‌లలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఆరంభ మ్యాచ్‌లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డుప్లెసిస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రెజర్ మెక్ గర్క్‌ను పేలవ ఫామ్ కారణంగా ఢిల్లీ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్ధానంలో అభిషేక్ పోరెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే డుప్లెసిస్ గాయం బారిన పడడంతో కరుణ్ నాయర్ కూడా ఓపెనర్‌గా వచ్చాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీకి ఓపెనర్లు మాత్రం మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇప్పుడు రాహులైనా ఢిల్లీకి మంచి ఆరంభాలను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.