స్టార్‌ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి... | Do You Know Reason Behind Why Smita Patil Cried After Shooting Of An Iconic Song With Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

ఆ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి...

May 17 2025 12:46 PM | Updated on May 17 2025 1:36 PM

After Shooting An Iconic Song With Amitabh Bachchan, Smita Patil Cried

ఇప్పుడంటే పెద్ద విషయం కాదు కానీ.. అంత ఆసక్తి కూడా లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో రెయిన్‌ సాంగ్స్‌ అంటే ఫుల్‌ క్రేజ్‌. అప్పట్లో ఓ దశాబ్ధం పాటు వానపాటలు లేకుండా మాస్‌ హీరోల సినిమాలు రాలేదంటే అతిశయోక్తి కాదేమో... ఎన్టీయార్‌ తరం నుంచి చిరంజీవి తరం దాకా కొన్నేళ్ల పాటు ఈ వానపాటల్తో ప్రేక్షకుల్ని తడిపి ముద్దచేసేశారు. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు అటు బాలీవుడ్‌లోనూ వీటి సందడి ఎక్కువే కనపడేది.

ఇప్పుడు లిప్‌లాక్, మితిమీరిన రొమాంటిక్‌ సన్నివేశాల్లో చేయడం గురించి ఎలాగైతే హీరోయిన్లు కొందరు తమ ఇబ్బందులు బయటపెడుతున్నారో...అప్పుడు వానపాటల గురించి అలాగే చెప్పుకునేవారు. తడిసి ముద్దయిన చీరలో హీరోయిన్‌ హీరోతో డ్యాన్సు చేస్తుంటే ప్రేక్షకులు కళ్లప్పగించేసేవారు కానీ అలా తెరకు ఒళ్లప్పగించేసినందుకు అందరూ కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం తెగ బాధపడేవారు.  అప్పట్లో బాలీవుడ్‌ సినిమా వానపాటల్లో సూపర్‌ హిట్‌ సాంగ్‌లో నటించిన ఓ హీరోయిన్‌ అదే విధంగా విపరీతంగా బాధపడింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిందీ విషయం.

కళ్లు తిప్పుకోనివ్వనంత అందం ఉన్నా, గ్లామర్‌తో కాకుండా బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది తారల్లో ఒకరు  స్మితా పాటిల్(Smita Patil), గ్లామర్‌కు కాకుండా, గంభీరతకు గుర్తుపెట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె తిరుగులేని స్థానం సంపాదించారు. స్వతంత్ర భావజాలంతో ఉండే స్మితాపాటిల్‌ కు సామాజిక విలువలపై  ఉన్న నమ్మకం ఆమె నటనలో పాత్రల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.

సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి, నిజాయితీతో నిండిన పాత్రలు పోషించిన స్మితా పాటిల్‌కు, మొదటి నుంచీ వాణిజ్య చిత్రాల మీద ఆసక్తి పెద్దగా లేదు. అందుకేనేమో ఆమె మొదటి మాస్టర్‌హిట్‌ కమర్షియల్‌ సినిమా ‘‘నమక్‌ హలాల్‌’’(Namak Halaal) విజయం గురించి ఆమె ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమా అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన  ‘ఆజ్‌ రఫత్‌ జాయేతో...‘ పాట ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. కుండపోత వర్షంలో  తెల్ల చీరలో తడిసి ముద్దవుతూ అందాలన్నీ బహిర్గత పరుస్తూ.. నాటి సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌( Amitabh Bachchan)తో చేసిన ఆ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందేమో కానీ..స్మితా పాటిల్‌ను మాత్రం ఉస్సురుమనిపించింది.  

తను ఎప్పుడూ ఊహించని రీతిలో కనిపించాల్సి రావడం ఆమె మనస్సుకు తీవ్రమైన బాధ కలిగించింది. ఆ రోజు వాన పాట షూటింగ్‌ పూర్తయిన తరువాత ఆమె తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయిందని, భోరుమంటూ ఏడ్చిందని సాక్షాత్తూ ఆ పాటలో ఆమె సహనటుడు, బాలీవుడ్‌ బిగ్‌బి  అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవలే వెల్లడించారు. మరి అలాంటి పాటకు ఆమె ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.

ఇది అంతా జరిగినదానికి మూలం సిల్సిలా అనే సినిమా. ఆ సినిమాలో మొదట స్మితా పాటిల్‌  పర్వీన్‌ బాబీ ఉండాల్సింది. కానీ వారికి బదులుగా చివరికి జయ బచ్చన్‌  రేఖ ఎంపికయ్యారు.  ఈ విషయం దర్శకుడు యశ్‌ చోప్రా నుంచి కాకుండా, శశికపూర్‌ ద్వారా తెలియడం స్మితా పాటిల్‌  మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని సమాచారం. ఆ గాయం పచ్చిగా ఉండగానే  నమక్‌ హలాల్‌ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆవేదనలోనో, ఒక నిర్వేదంలోనో నమక్‌ హలాల్‌కి ఓకే చెప్పేసిందట. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించినా, తనకు మరిన్ని సినిమా అవకాశాలు అందించానా... సినిమా రంగంలో తన విలువలకు భిన్నంగా చేశాననే భావన ఆమెను వెంటాడింది.

విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందినా.. తనను ఆ పాటలో హీరోయిన్‌గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం ఆమెకు ఎప్పటికీ ముళ్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత స్మితా పాటిల్‌ ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడంతో బాలీవుడ్‌ ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిని కోల్పోయింది. సదరు నమక్‌ హలాల్‌ సినిమాను భలేరాముడు పేరుతో మోహన్‌బాబు హీరోగా తెలుగులోనూ తీశారు. ఆ సినిమాలోనూ వానపాట ఉంది అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత ఘాటుగా తెలుగు పాటను చిత్రీకరించారు. ఆ వానపాటలో ఒకనాటి హీరోయిన్‌ మాధవి మోహన్‌బాబుకు జోడీగా నర్తించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement