భారత్, అఫ్గాన్‌ స్నేహ గీతం | India, Afghanistan Reaffirm Ties Amid Terror And Tensions | Sakshi
Sakshi News home page

భారత్, అఫ్గాన్‌ స్నేహ గీతం

May 17 2025 5:00 AM | Updated on May 17 2025 5:00 AM

India, Afghanistan Reaffirm Ties Amid Terror And Tensions

అఫ్గాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌  

పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు  

పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్‌ వ్యూహరచన  

ప్రాంతీయ ప్రయోజనాల కోసం అఫ్గాన్‌కు స్నేహహస్తం  

రెండు దేశాల మధ్య మరింత బలపడనున్న సంబంధాలు  

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్‌ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తాజాగా అఫ్గానిస్తాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. 

పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం పట్ల భారత్‌ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 

1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్‌ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్‌ చేపట్టేందుకు భారత్‌ సిద్ధపడగా, అప్పటి తాలిబన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి.  

తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు  
శతాబ్దాల పాటు అఖండ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్‌ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్‌ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్‌ రిపబ్లిక్‌ దేశంగా అవతరించింది. అఫ్గాన్‌ను భారత్‌ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది.

 పాకిస్తాన్‌ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్‌ సర్కార్‌ను గుర్తించేందుకు భారత్‌ నిరాకరించింది. విమానం హైజాక్‌ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్‌–అఫ్గాన్‌ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్‌పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్‌ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు.  

ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు!  
మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్‌–అఫ్గాన్‌ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్‌ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్‌ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్‌ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సైతం అఫ్గాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్‌ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్‌ భావిస్తున్నట్లు సమాచారం.  

పాకిస్తాన్‌కు ఇక ముసళ్ల పండుగే  
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్‌ నుంచే కుట్ర జరిగినట్లు భారత్‌ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్‌ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్‌కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్‌ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది.  

పాక్‌–అఫ్గాన్‌ మధ్య రగులుతున్న విభేదాలు  
తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్‌ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్‌ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తూంక్వా, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్‌ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్‌ ఆరోపిస్తోంది.

 అఫ్గాన్‌ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్‌లో పాక్‌ సైన్యం అఫ్గాన్‌లోని పాక్తీకా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్‌ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్‌ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్‌ పాలకులు నిర్ధారించిన డురాండ్‌ లైన్‌ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్‌ గుర్తిస్తుండగా, అఫ్గాన్‌ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్‌ శరణార్థులను పాక్‌ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 
సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement