సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామని 143 హామీలతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు తనని తిట్టుకుంటున్నారని తెలిసి కూడా ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్టు చంద్రబాబు 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో అనంతపురంలో హడావుడి చేశాడు.
సూపర్ సిక్స్లో సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఈ పథకానికి రూ.10,800 కోట్లు అవసరం అనుకుంటే, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 1.80 కోట్ల మంది మహిళలను వంచించాడు.
ఆ లెక్కన ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవసరం అవుతాయి. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పి, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది మాత్రం అరకొరగా అమలు చేశాడు. ఆఖరుకి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలుపెట్టి కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేసి ఆంక్షలు విధించాడు. దీపం-2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గతేడాది ఒక్క సిలిండర్ ఇచ్చాడు.
ఈ ఏడాది ఒక్క సిలిండర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నేటికి 15 నెలలు గడిచిపోయాయి. వారిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించే దమ్ము చంద్రబాబుకి ఉందా?
50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా 15 నెలల్లో దాదాపు 5 లక్షల పింఛన్లు పీకేశాడు. ఇది కాకుండా మరో 7 నుంచి 10 లక్షల మంది పింఛన్లకు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు.
ప్రభుత్వం దగ్గర రూ. 4500 కోట్లు లేవా?
నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేసి పేదలకు దూరం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని వైఎస్ జగన్ కోరుకుంటే చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు తన వారికి ధారాదత్తం చేసేస్తున్నాడు. వైఎస్ జగన్ ప్రణాళిక ప్రకారం 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 2550 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.
డాక్టర్లు కావాలనుకునే పేద విద్యార్థుల కలను చిదిమేశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. రెండో విడతలో పాడేరులో 50 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ మీద కోపంతో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అసలు పనులే జరగలేదంటూ పిల్లర్ల దశలో ఉన్న భవనాల వద్దకు పోయి వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కనపెట్టేశాడు. ఎందుకని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్రబాబు చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారంటే ఈయన్ను విజనరీ అని ఎలా అనాలో అర్ధం కావడం లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసే విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనతో చంద్రబాబు పాలననను పోల్చి చూస్తూ అసలైన విజనరీ జగనా, చంద్రబాబో ప్రజలు నిర్ణయానికొచ్చేశారు.
రైతులను పట్టించుకోవడం మానేశారు
కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాడు. రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేసిందే కాకుండా వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాడు. గతంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బస్తా కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏదని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో కిలో ఉల్లి రూ.40ల ధర పలికితే నేడు రూ.3 లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కిలో టమాట రూపాయిన్నరకి అమ్మాల్సి వస్తుంది. రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అరటి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వరి, శెనగ, వేరుశెనగ.. ఇలా రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వైఎస్ జగన్ ధరల పతనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమీక్షల పేరుతో రెండురోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్పించి రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యవసాయం అధోగతే అని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు రైతు సమస్యలపై దృష్టిపెట్టాలి.
వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారు
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సందర్భం లేకపోయినా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్సార్సీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బురద రాజకీయాలు చేస్తారో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. షర్మిల, సునీతలను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పునర్విచారణ కావాలని కోరడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.

కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని టీడీపీ భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్రబాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సైతం అవినీతి సంపాదనకి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలెక్షన్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్నే కేటాయించారు. చంద్రబాబు ఇచ్చిన 143 హామీలన్నింటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ సంతకాలు చేశాడు. కానీ వాటి అమలు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. స్పెషల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయనకి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు.
చంద్రబాబుకి రాజ్యాంగం మీద గౌరవం లేదు..
చంద్రబాబుకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. సమస్యల మీద చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడిపోతున్నారు. 11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూసి 164 మంది భయపడిపోతున్నారు. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనేక ప్రెస్మీట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. కానీ ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పే దమ్ము అధికార పార్టీకి లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవరైనా నమ్మగలరా?