రేవంత్‌ vs మెస్సీ.. ఉప్పల్‌లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి | Messi Football match bhatti vikramarka inspection at uppal stadium | Sakshi
Sakshi News home page

రేవంత్‌ vs మెస్సీ.. ఉప్పల్‌లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి

Dec 7 2025 1:37 PM | Updated on Dec 7 2025 2:50 PM

Messi Football match bhatti vikramarka inspection at uppal stadium

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మ్యాచ్ అంటే ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఊగిపోతారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని వాటిని పరిశీలిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు కలిసి పర్యవేక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకోవాలి. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్‌ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఫుట్‌బాల్‌ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అలాగే, గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు వస్తున్నారు.

ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్ కోసం మెస్సీ.. వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పాటుచేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement