సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.
‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్ నెట్‌వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.
‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్‌కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్‌తో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని నాగార్జున యాదవ్ తెలిపారు.


