సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్‌ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.
‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్ మండిపడ్డారు.
‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో లేకుండా ఎలా పోయాయి?
..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని శివశంకర్ హితవు పలికారు.


