తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్‌పర్సన్లు, జడ్సీ వైస్ చైర్‌పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్‌ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.
ఇదీ చదవండి:
చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్


