సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలకు తిలోదకాలిచ్చేశారని, అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, చివరికి డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని కూడా గాలికి వదిలేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సరైన కారణాలు లేకుండా సభను తరచుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్స్‌కు విరుద్ధమని హరీష్ రావు వాపోయారు.
సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనన్నారు.
గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని హరీష్‌రావు పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించిందన్నారు. అయితే ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్.. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా?


