సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్‌సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలు
ఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్‌లా మారిపోయాడని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది.
మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.
మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?
1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.
బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.
పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి
పీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.
ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.
పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారం
ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.
పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్‌సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.
స్థాయీ సంఘం పేరుతో అబద్దాలు
కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.
వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.
పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.
చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?
కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానా
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.
పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?
5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైంది
మెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..
మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.
ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.
మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.
కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయం
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.
15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్‌కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు.