నిర్వాసితుల పోరాటంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి
చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని నిర్వాసితులు చేస్తున్న పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ముంపు నుంచి మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 12వ రోజు చేసుకున్నాయి. రిలే దీక్షలకు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి జక్క బాలయ్య, లక్ష్మీనారాయణ, బసవరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయి ఉన్న ఫలంగా గ్రామాలను వదిలి వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్థ్యం తగ్గించి, వెంటనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేసే వరకు పౌరహక్కుల సంఘం మద్దతు ఉంటుందని చెప్పారు. అక్కడి నుంచి గతంలో గోకారం చెరువును ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించారు. చెరువును ధ్వంసం చేయడం వల్ల ఎంతో మంది మత్స్యకారులు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.


