స్వగ్రామాలే సవాల్..!
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు
● స్వీయ పర్యవేక్షణతో పాటు వేగుల ద్వారా పావులు
● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం
● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు
ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ
జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్‌ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు.
..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్‌ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభావిత వర్గాలు..
బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి
మహిళలు 2,706
పురుషులు 2,658
మొత్తం ఓటర్లు 5,364
ధన్వాడ పంచాయతీ కార్యాలయం
ప్రభావిత వర్గాలు..
పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి
పురుషులు 4,034
మహిళలు 4,293
మొత్తం ఓటర్లు 8,327
ప్రభావిత వర్గాలు..
పురుషులు 1,369
మహిళలు 1,416
మొత్తం ఓటర్లు 2,785
ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్
పుల్లూరు: ఎవరి ధీమా వారిది
తూడుకుర్తి: నువ్వా.. నేనా..
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్‌ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్‌ఎస్‌కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ మద్దతుదారు సునీత, కాంగ్రెస్ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్‌తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు.
స్వగ్రామాలే సవాల్..!
స్వగ్రామాలే సవాల్..!
స్వగ్రామాలే సవాల్..!


