ఈసీ మార్గదర్శకాలు విధిగా పాటించాలి
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్/అమరచింత/ఆత్మకూర్: పీఓ, ఓపీఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ ఎంపీడీఓ కార్యాలయాలు, అమరచింత ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్నిరకాల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తీసుకొని కేటాయించిన గ్రామపంచాయతీకి రూట్ వారీ బస్సులో తరలివెళ్లారు. కలెక్టర్ వెంట ఎన్నికల సాధారణ జిల్లా పరిశీలకుడు మల్లయ్య బట్టు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు.


