1,150 మంది సిబ్బందితో బందోబస్తు : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసిస్తూ.. రెండోవిడత విధులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. రెండోవిడతలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లోని 94 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 1,150 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటిస్తూ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసుశాఖ నిషిత పరిశీలన ఉందని.. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచా రం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్పులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు.
సజావుగా
రెండోవిడత ఎన్నికలు
మదనాపురం: మండలంలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రూట్ అధికారులు ఉన్నారు.
అమరచింతలో
ఝార్ఖండ్ బృందం
అమరచింత: స్థానిక చేనేత ఉత్పత్తుల సంఘం పనితీరు అద్భుతంగా ఉందని ఝార్ఖండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రతినిధులు కొనియాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘంలో తయారవుతున్న జరీ చీరలు, రెడీమెట్ వస్త్రాల తయారీపై అధ్యయనం చేయడానికి ప్రతినిధుల బృందం రెండ్రోజుల పర్యటనకు వచ్చిందని సంఘం సీఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. సంఘం ఏర్పాటును వారికి వివరించామన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు తమ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో ఇక్కడి క్లస్టర్‌ను సందర్శించామని నోడల్ ఏజెన్సీ కంపెనీ సీఈఓ శ్యాంసుందర్, టెక్నికల్ అడ్వయిజర్ బిష్యుప్రసాద్, మహిళా ప్రతినిధులు తెలిపారు. ఇక్కడి నేత కార్మికుల పనితీరును పరిశీలించామని త్వరలోనే తమ రాష్ట్రంలో ఇలాంటి కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని.. ఎన్టీఆర్ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
1,150 మంది సిబ్బందితో బందోబస్తు : ఎస్పీ
1,150 మంది సిబ్బందితో బందోబస్తు : ఎస్పీ


