ముగిసిన గ్లోబల్ సమ్మిట్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్ నిర్వహించింది. 10 నుంచి 13వ తేదీ వరకు ప్రాంగణాన్ని సందర్శించడానికి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు అనుమతిచ్చింది. ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శనివారం ముగింపు సందర్భంగా ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, స్పీడీ సీఈఓ ఈవీ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్ శ్రేయస్సుకు వర్తమాన పద్ధతులు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహ్యం అనే అంశంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సెంటర్ ఫర్ సస్టేయినబుల్‌పై అగ్రికల్చర్ డైరెక్టర్ జీవి రామాంజనేయులు, విశ్రాంత ఐఏఎస్ ఎంవీ రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎస్‌డీ శిఖామణి, పార్మర్స్ కార్పొరేషన్ ఫౌండర్ సీఎస్ రెడ్డి, అగ్రి బిజినెస్, అగ్రిటెక్ నిపుణుడు విజయ్ నడిమింటి తదితరులు చర్చించారు. గ్రామీణ తెలంగాణను పట్టణ ప్రాంతానికి అనుసంధానించడం అనే అంశంపై వీసీ డి.రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.నర్సింహారెడ్డి తదితరులతో చర్చా గోష్టి నిర్వహించారు. రైతు సంఘం నాయకులు అన్వేష్‌రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు, ఆదర్శ మహిళా రైతు లావణ్య తదితరులు వ్యవసాయంపై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. గాయని మంగ్లీ పాటలతో అలరించగా, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
చివరిరోజు తరలివచ్చిన సందర్శకులు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు


