ఆరు కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ
● పరిశీలించిన కలెక్టర్ విజయేందిర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 142 సర్పంచ్ స్థానాలు, 1,065 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఆరు కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. చిన్నచింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రలోని మార్కెట్‌యార్డు, హన్వాడలోని బాలిక పాఠశాల, కోయిలకొండలో రైతు వేదిక, కౌకుంట్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మిడ్జిల్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని పంపినీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవిలు వేర్వేరుగా దేవర కద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల పోలింగ్ సామ గ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చా రు. పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు మొత్తం 148 వాహనాలను అందుబాటులో ఉంచారు.
● రెండో విడత పోలింగ్‌కు సంబంధించి 151 మంది రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పాటు 13 రిజర్వ్‌తో కలిపి 164 ఆర్‌ఓలను నియమించారు. 1,334 ప్రిసైడింగ్ ఆఫీసర్లను, 1,584 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 45 మంది జోన్ ఆఫీసర్లను నియమించారు. ఈ విడతలో 48 రూట్లు ఉండగా.. 65 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
● ఈ విడతలో 58 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామ పంచాయతీ పరిధిలో 12, సీసీకుంటలోని ఉంద్యాల 8 , దేవరకద్రలోని నాగారంలో 10, కోయిల్‌కొండ శేరివెంకటపూర్‌లో 8, కౌకుంట్లలోని ఇస్రాంపల్లిలో 8, మిడ్జిల్‌లో 12 పోలింగ్‌స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
● రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు కాత్యాయనీదేవితో కలిసి వెబెక్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. వార్డు సభ్యుల సంఖ్య ననుసరించి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీ నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించాలని, కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్‌లు సీల్ వేసేప్పుడు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్‌డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు.
ఆరు కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ


