700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్దఅదనపు బలగాలు : ఎస్పీ డా. వినీత్
నారాయణపేట: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. ఆదివారం నారాయణపేట, దామరిగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో రెండోవిడత పోలింగ్ జరగనుండగా.. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో మొత్తం 28 రూట్లు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు 5 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌రోజు, కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను వివరించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పని చేయాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 (బీఎన్‌ఎస్‌స్)యాక్ట్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించవద్దని, కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇతర హానికర వస్తువులు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ఊరేగింపు, ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, రఘునాథ్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


