పోలింగ్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ. మరికల్ మండలాల పరిధిలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఆమె ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్‌లో విధులు నిర్వహించిన వారిలో కొందరు రెండోవిడత నియమింపబడ్డారని, విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించే అవకాశం ఉందని, పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలను ఎవరూ నిలిపివేయరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు ప్రవేశం లేదని, కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు చేయాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని, మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అబ్జర్వర్ ఆదేశాల అనంతరమే ఫలితాలు వెల్లడించాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామగ్రిని జాగ్రత్తగా సీల్‌చేసి డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. కాగా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను దామరగిద్ద, మరికల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు.


