నిర్భయంగా ఓటు వేయాలి: ఎస్పీ
నారాయణపేట రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వినీత్ అన్నారు. ఎన్నికల దృష్టా ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మండలంలోని జాజాపూర్లో శుక్రవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, ముఖ్యంగా క్రిటికల్ గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా, ఇతరులను భయపెట్టేందుకు ప్రయత్నించినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అంతకుముందు నిర్భయంగా ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. ఓటు మన హక్కు.. అనే నినాదాలతో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు రాముడు, వెంకటేశ్వర్లు, నరేష్, రాజు, శివశంకర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


