నోట్లు మీకు.. ఓట్లు మాకు!
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు
నారాయణపేట: నోట్లు మీకు.. ఓట్లు మాకు అంటూ అభ్యర్థులు ఓటర్లకు గప్‌చుప్‌గా ఎరవేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో డబ్బు, దావత్‌లు, చికెన్ పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో 85 గ్రామ పంచాయతీలు, 672 వార్డుల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. మద్యం, డబ్బుల పంపిణీ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. లెక్కించనున్నారు.
ఒక్క చాన్స్ ఇవ్వండి
రెండో విడత గ్రామ పంచాయతీల్లో ప్రచారం చివరి రోజు హోరెత్తించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు మించి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా చేపట్టారు. సర్పంచులు, వార్డు సభ్యులు తమ గెలుపు కోసం ఓటర్ల మద్దతు కోసం ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీలు బలపరిన సర్పంచ్ అభ్యర్థులే కాకుండా కాంగ్రెస్ రెబల్, స్వతంత్రంగా బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రలోభాల కట్టడి సాధ్యమేనా..
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా అభ్యర్థులు పెడచెవిన పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన డబ్బు, మద్యం పట్టుకుంటే పోలీసు శాఖలో తమకు స్థాన చలనం అవుతాయనే భయంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని అధికారులకు సమాచారం ఇస్తే వారి పేర్లు ఎక్కడ బయటపెడుతారనే భయంతో ఎవరూ చెప్పేందుకు ముందుకు రావడం లేదు. తూతూమంత్రంగా వాహన తనిఖీలు చేస్తారే తప్పా.. డబ్బు, మద్యం పంపిణీపై ఎలాంటి దృష్టి సారించరనేది బహిరంగ రహస్యమేనంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఓటరు.. క్వాటర్!
ఎన్నికలకు రెండు రోజుల ముందే బార్లు, వైన్స్‌లు బంద్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించడంతో దుకాణాలు బంద్ అయ్యాయి. మద్యం ప్రియుల అలవాటును ఆసరా చేసుకొని మద్యాన్ని ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు ఇప్పటికే తమ బంధువులు, నమ్మకస్తులు, స్నేహితుల ఇళ్లలో కాటన్లకు కాటన్లు డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తుల స్లీప్‌లతో క్వాటర్లను పంచేందుకు సిద్ధపడుతున్నారు.
రెండో విడత పోలింగ్‌కు మిగిలింది ఒక్కరోజే
కూర్చున్న కాడికే మందు, ఫ్రైలు
కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500,రూ.వెయ్యిపైనే..
తూతూమంత్రంగానే అధికారులు తనిఖీలు
నోట్లు మీకు.. ఓట్లు మాకు!


