మద్యం, డబ్బులు లేకుండా ఎన్నికలు జరగాలి
నారాయణపేట రూరల్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్పులు చేసి డబ్బులు ధారపోసి ఆగం కావద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీలో ఓటుకు వెయ్యి నుంచి రూ.6 వేల వరకు ఖర్చుపెడుతున్నారని, అలాగే ఏకగ్రీవ ఎన్నికల కోసం రూ.లక్షలు ధారపోస్తున్నారని ఆందోళన చెందారు. ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి చేసే వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ ఇంతవరకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పడకుల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, బలరాంరెడ్డి, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, సుజాత, గోపాల్, సత్యరఘుపాల్, వెంకటయ్య, వినోద్, కృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.


