ఖాకీల నిఘా
మహబూబ్‌నగర్ క్రైం: రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఖాకీలు గట్టి నిఘా పెట్టారు. 1,334 పోలింగ్ కేంద్రాల్లో 1,249 మందిని బందోబస్తు కోసం కేటాయించారు. ఇందులో 36 గ్రామాల్లో 355 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు.49 రూట్ మొబైల్స్, 16 ఎఫ్‌ఎస్‌టీ, 5 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన వారందరూ శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల సామగ్రితో సహా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల కోసం ఒక ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 29మంది సీఐలు, 66 మంది ఎస్‌ఐలు, 1,134 మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు.
● పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ జిల్లావ్యాప్తంగా రూ.11 లక్షల నగదు, 80 మద్యం కేసుల్లో రూ.6.72 లక్షల విలువ చేసే 1 043.43 లీటర్ల మద్యం, ఎన్నికల నియమావళి కేసులు మూడు, నాకా బందీ 55, 37 తుపాకులు డిపాజిట్, 448 కేసుల్లో 630 మందిని బైండోవర చేశారు.
అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. శనివారం దేవరకద్ర, హన్వాడలో పోలీస్ సిబ్బందికి విధులపై సూచనలు చేశారు. రాత్రి టంకర పోలింగ్ కేంద్రం వద్ద గస్తీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ జరుగుతున్న సమయంలో అవాంచనీయ ఘటనలు, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటే వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్ సిబ్బంది చురుకుగా విధులు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే క్షణం వరకు ప్రతి ఒక్కరూ కేటాయించిన స్థానాల నుంచి పక్కకు వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి పెట్టాలని, ఏదైనా గొడవలు చేయాలని చూసినా, గుంపులుగా నిలబడినా అప్రమత్తంగా ఉంటూ అడ్డుకొని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
రూ.11 లక్షల నగదు, 1,043 లీటర్ల మద్యం సీజ్
గ్రామాల్లో 630 మంది బైండోవర్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి


