పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
కల్వకుర్తి టౌన్: ఇటీవల ప్రతి ఒక్కరిలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది. కానీ, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడడం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ దానిని సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. ఓటర్ నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49(ఎం) (ఓటు రహస్యం బహిర్గతం) నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును ఓట్ల లెక్కింపు సమయంలో పరిగణించకుండా, ఓటును 17(ఏ) ఫారంలో నమోదు చేస్తారు. ఎన్నికల సంఘం నియమావళి 49(ఎన్) ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడు ఓటును బహిరంగపరచనని ఎన్నికల నియమావళిలోని నిబంధన 10లో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.


