పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు
● హామీ అమలు కాకపోవడంతోనే రంగారెడ్డిగూడలో ఓటమి
● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు
జడ్చర్ల: రగామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యాయని, ఫలితంగా కొన్ని గ్రామాల్లో గెలుపు అంచుకు వచ్చి తమ అభ్యర్థులు ఓటమి చెందారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలివిడత ఎన్నికలు జరిగిన నవాబ్‌పేట, రాజాపూర్, ఊర్కొండ మండలాల్లో 50 శాతానికిపైగా తమ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారన్నారు. చాలా గ్రామాల్లో బీఆర్‌ఎస్ సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెట్టకుండా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. రాజాపూర్ వంటి కీలక పంచాయతీలో సైతం బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. ఇక్కడ రెండు సార్లు ఓడిన అభ్యర్థి ఎలాగూ సానుభూతి వచ్చి గెలుస్తాడన్న నమ్మకంతో బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఇలా చాలా చోట్ల మద్దతు ఇచ్చి కాంగ్రెస్‌ను ఓడించే ప్రయత్నం చేసిందని, అయినా మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు సీఎం రేవంత్‌రెడ్డి, తన ఫొటోలు పెట్టుకుని దర్జాగా ప్రచారం చేశారని, బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కేసీఆర్, లక్ష్మారెడ్డి ఫొటోలతో ఎక్కడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించలేదని ఎద్దేవా చేశారు. కన్నీళ్లు పెట్టుకొని, కాళ్ల బేరాలు ఆడుతూ.. ఆత్మహత్య చేసుకుంటామంటూ సానుభూతి ఓట్లతో గట్టెక్కారని దుయ్యబట్టారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా ఎక్కువ మంది పోటీ చేసి ఓట్లు చీలిపోయి ఓటమి చెందారని అన్నారు. రెండు, మూడో విడత ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా సమీక్షిస్తామన్నారు.
రంగారెడ్డిగూడలో ఓడిపోయాం..
తన సొంతూరు రంగారెడ్డిగూడలో తమ అభ్యర్థి ఓటమి చెందడంపై బీఆర్‌ఎస్ విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థికి కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. తమ గ్రామాన్ని స్పాంజ్ ఐరన్ కాలుష్య పరిశ్రమ నుంచి కాపాడుతానని ఇచ్చిన హామీని సకాలంలో నిలబెట్టుకోకపోవడం వల్ల తమపై అసంతృప్తితో ఓడించారని చెప్పారు. గతంలో తమ అమ్మ, సోదరుడు ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారని తెలిపారు. గతంలో లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కావేరమ్మపేట సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని, లక్ష్మారెడ్డి సొంతూరు ఆవంచలో ఆయన మద్దతు అభ్యర్థి ఓడారని గుర్తుచేశారు. సమావేశంలో నాయకులు శివకుమార్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు


