రాచకొండ పోలీసులకు డీజీపీ అభినందనలు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందుకుగాను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, సిబ్బందిని డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఎలాంటి లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డీజీపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇద్దరు వ్యక్తుల రిమాండ్
మల్లాపూర్: గుట్టు చప్పుడు కాకుండా పాపిస్ట్రా డ్రగ్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం నుంచి చిలుకానగర్‌కు వెళ్లే దారిలో వాహనాల తనీఖీలు చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన రమేష్ కుమార్, సురేష్‌కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీపులు వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను సోదా చేయగా పాపిస్రా డ్రగ్‌ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నగరానికి వలసవచ్చి చెంగిచర్లలో ఉంటూ రేలింగ్ పని చేస్తున్నట్లు తెలిపారు. మంగళ్‌రామ్ అనే వ్యక్తి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రాను కోనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రా డ్రగ్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


