రెండో సంగ్రామం
రెండో సంగ్రామం జిల్లాలో రెండో విడతలో తూప్రాన్, మనోహరాబాద్ చేగుంట, నార్సింగి, రామాయంపేట, ని జాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఎనిమిది మండలాల పరిధిలోని 149 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 7 పంచాయతీలతో పాటు 254 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 142 సర్పంచ్, 1,036 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు.
సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుండగా, 500 లోపు ఓట్లు ఉన్న పల్లెల్లో కేవలం గంటలోపే ఫలితాలు వెలువడనున్నాయి. 1,000.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలు రానున్నాయి. మేజర్ పంచాయతీలో మాత్రం అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగనుంది. పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో 144 సెక్షన్ అమలు చేస్తారు. ముఖ్యంగా పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 34 జీపీలను సమస్మాత్మక గ్రామాలుగా గుర్తించిన పోలీసులు, ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు అనుసంధానం చేసి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు ఖర్చు చేశారు. మద్యం, బీరు, బిర్యానీ నుంచి మొదలుకొని గంపగుత్త ఓట్ల కోసం కుల సంఘాలకు ప్రసన్నం చేసుకున్నారు. కుల దేవతలకు సంబంధించిన ఆలయాల నిర్మాణాలు, టెంట్‌హౌస్ లు, వంట పాత్రలు ఇప్పించటంతో పాటు కొన్ని గ్రామాల్లో ఏకంగా కుల సంఘాలకు సంబంధించిన ఆలయాల నిర్మాణాల కోసం ఊరికి సమీపంలో భూములు కొనుగోలు చేసి ఇచ్చారు. ఓటర్లను అన్నిరకాల ప్రలోభాలకు గురిచేసిన అభ్యర్థులు, ఆఖరి అస్త్రంగా కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం.
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
రెండో విడత ఎన్నిక జరిగే ప్రదేశాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత అందరు కలిసి వచ్చేంత వరకు కాకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే బందోబస్తుతో తిరిగి వచ్చేలా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించారు. ఏ పంచాయతీలో ఎన్నికలు ముగిస్తే ఆ రూట్లో ఉన్న వారందరూ వేచి చూడకుండా పోలీసు బందోబస్తుతో ముగిసిన వెంటనే డబ్బాలతో తిరిగి వస్తే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అన్ని సక్రమంగా పరిశీలించుకొని వెళ్లాలన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఎంపీడీఓ లక్ష్మి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం
2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా శనివారం వివిధ మండలాలకు ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన గ్రామాలకు సిబ్బంది తరలివెళ్లారు.
– మెదక్‌జోన్
తేలనున్న భవితవ్యం
పోటాపోటీగా పంపకాలు
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
142 సర్పంచ్,
1,036 వార్డు స్థానాలకు ఎన్నికలు
ఉదయం 7 గంటల నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
2 గంటల నుంచి కౌంటింగ్
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది