ఎన్నికల కూలీలు
● ప్రచారానికి పైసలిచ్చి తీసుకెళ్తున్న నేతలు
● నేడు ఒక అభ్యర్థికి.. రేపు మరొకరికి జై
వెల్దుర్తి(తూప్రాన్): ఒకప్పుడు పల్లెకో, పట్టణానికో నాయకుడు వస్తే జనం స్వచ్ఛందంగా కదలివచ్చేవారు. ర్యాలీల్లో నేతలతో కలిసి పాదం పాదం కలిపేందుకు, సభల్లో వారి ప్రసంగాలు వినేందుకు పోటీ పడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలివచ్చేవారు.. నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు. దీంతో అభ్యర్థులు, ఆశావహులు సభలు, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ ఇక్కడ.. రేపు అక్కడ.. కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే.. రేపు మరో పార్టీకి అను కూలంగా నినాదాలు చేస్తున్నారు. ఆయా గ్రా మాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకునేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లెక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామాలు, పట్టణాల్లో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రచారానికి వస్తే రోజుకు రూ. 300 కూలీ ఇస్తూ టిఫిన్, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ఒకే రోజు రెండు పార్టీల మీటింగ్‌లు, ప్రచారాలు ఉంటే మాత్రం కూలీల రేటు రెండింతలు అవుతుంది. పైపెచ్చు ప్రచారం పూర్తికాగానే మగవారికి మద్యం బాటిల్ చేతిలో పెట్టి రేపటి ప్రచారానికి మళ్లీ రావాలని మురిపిస్తున్నారు.
ఎన్నికల కూలీలు


