మన పబ్బులెంత భద్రం.? | - | Sakshi
Sakshi News home page

మన పబ్బులెంత భద్రం.?

Dec 14 2025 1:37 PM | Updated on Dec 14 2025 1:37 PM

మన పబ్బులెంత భద్రం.?

మన పబ్బులెంత భద్రం.?

బంజారాహిల్స్‌: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ వేడుకల కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సుమారు 150కి పైగా పబ్‌లు, క్లబ్‌లు, నైట్‌ క్లబ్‌లు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇప్పటికే కలర్‌ఫుల్‌ థీమ్‌లతో ఆకట్టుకునే కార్యక్రమాలతో ఉర్రూతలూగించే బ్యాండ్‌తో హైలెట్‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. సెలబ్రిటీలు, అంతర్జాతీయ డీజేలను రప్పించి ఈ వేడుకలకు సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చేందుకు వీరు సిద్ధమయ్యారు. అయితే వారం రోజుల క్రితం గోవాలోని ఓ నైట్‌ క్లబ్‌లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది మృతి చెందారు. అక్కడ ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ లేకపోవడంతో పాటు భద్రతాపరంగా లోపాలు ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు నిర్థారించారు. మరి గ్రేటర్‌ పరిధిలోని మన పబ్‌లు, నైట్‌క్లబ్‌లు ఎంత వరకు భద్రంగా ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించే పబ్‌లు, నైట్‌ క్లబ్‌ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో మాత్రం ఫైర్‌ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవడంలో చేతులెత్తేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఎకై ్సజ్‌ పోలీసులు మద్యం లైసెన్స్‌లు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వేడుకలకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటుండగా పబ్‌లు, నైట్‌ క్లబ్‌లలో భద్రతపై మాత్రం దృష్టి సారించడం లేదు. పలు పబ్‌లలో ఇప్పటికీ ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోకపోవడం గమనార్హం. ఏదైనా ఘటన జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గోవా ఘటన జరిగినప్పుడే అధికారులు మేల్కొని ఆయా పబ్‌లు, క్లబ్‌లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదు. సుమారు 80 శాతం పబ్‌లలో ఫైర్‌ ఎక్విప్‌మెంట్స్‌ లేనట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్వాహకులు ముందుకు రావడం లేదు. న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి ఇచ్చే ముందు ఫైర్‌, ఎకై ్సజ్‌,జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసుల నుంచి అనుమతుల పత్రాలు, ఎన్‌ఓసీలు చూపించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో శాఖ ఒక్కో అనుమతి పత్రం ఇస్తుండటంతో నిర్వాహకులు తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సంబంధిత అధికారులకు నిబంధనలు గుర్తుకు వస్తున్నాయి. హడావిడిగా వెళ్లి అనుమతులు పరిశీలిస్తున్నారు.

అంతస్తులను బట్టి అనుమతులు..

అవుటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల 15 మీటర్ల ఎత్తు నిర్మాణాలకు హైడ్రా ఫైర్‌ స్టేఫ్టీ అనుమతులు ఇస్తోంది. అంతకుమించి ఉంటే నేరుగా ఫైర్‌ డిపార్ట్‌మెంటే అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనిని సాకుగా చూపి సదరు పబ్‌ల నిర్వాహకులు తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా అన్ని పబ్‌లు, నైట్‌ క్లబ్‌లు వేలాది మంది యువతను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గోవా తరహా సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక వైపు హైడ్రా, ఇంకో వైపు పోలీసు, మరో వైపు ఫైర్‌ అధికారులు వీటిపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఫైర్‌ లైసెన్స్‌ లేని పబ్‌లను సీజ్‌చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోతే వెంటనే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

80 శాతం పబ్‌లకు లేని ఫైర్‌ సేఫ్టీ

పట్టించుకోని అధికారులు

చేతులెత్తేస్తున్న పోలీసులు,

ఇష్టానుసారంగా అనుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement