Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan1
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్‌ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్‌ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

Hyderabad woman request to Indian External Affairs Minister Jaishankar2
''నాకు సాయం చేయండి సార్‌'.. జైశంకర్‌కు హైదరాబాద్‌ యువతి అభ్యర్థన

హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్‌గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్‌ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో ఓ రూమ్‌ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్‌ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు తన లేఖలో పేర్కొంది.

Rasi Phalalu: Daily Horoscope On 17-09-2025 In Telugu3
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.17 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.38 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.26 నుండి 7.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.2.46 నుండి 4.18 వరకు, మతత్రయ ఏకాదశి.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 6.00రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య....... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.తుల... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మకరం... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

Expert advice on Sadabainama4
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!

సాక్షి, హైదరాబాద్‌: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్‌ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్‌తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్‌లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్‌లైన్‌లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్‌లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్‌ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్‌ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్‌లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు.

Sakshi Editorial On Supreme Cour On Waqf Amendment Act5
ఉన్నంతలో ఉపశమనం

వివాదాస్పద వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్‌ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్‌ కుమార్‌ ఝూ(ఆర్జేడీ), జియావుర్‌ రహమాన్‌(కాంగ్రెస్‌) ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్‌ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్‌ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్‌ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్‌ బై యూజర్‌) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్‌ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్‌ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్‌ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్‌ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్‌కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్‌ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్‌ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్‌ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్‌ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్‌ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్‌ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది.

Sakshi Guest Column On Hyderabad Liberation Day6
ఇది విమోచనమే!

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. వీరులను స్మరించుకోవడానికి...1998 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్‌ 17ను ‘హైదరాబాద్‌ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్‌ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్‌ 12న ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్‌ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్‌కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట పోలీస్‌ చర్య తర్వాత 1948 సెప్టెంబర్‌ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. అయితే, సెప్టెంబర్‌ 17ను ‘హైదరాబాద్‌ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్‌లో పేర్కొన్నారు. అసంబద్ధమైన పేర్లుగతంలో హైదరాబాద్‌ సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్‌ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ ప్రచురించి సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్‌ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్‌ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్‌పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్‌ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 1948 సెప్టెంబర్‌ 17 ‘హైదరాబాద్‌ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.సీహెచ్‌. విద్యాసాగర్‌ రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

Prisoner swallowed Studs Hustle without cooperating with medical care7
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్‌చల్‌

చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్‌చల్‌ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్‌,మధు ట్రబుల్‌ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్‌కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్‌ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్‌ కళాసాగర్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులో లేరు.

China Replaces Germany in Top Ten of UNs Most Innovative Nation8
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..

చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ కంట్రీస్‌ యాన్యువల్ ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్‌.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు.

masood azhar family torn apart over operation sindoor9
‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్‌ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకునేందుకు పాక్‌ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్‌లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025

Supreme Court Key Comments On Viveka Case10
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్‌.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్‌జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్‌ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్‌ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్‌ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్‌ రన్‌ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement