సమయపాలన | Ramalakshmi Sadanandam about Samayapalana | Sakshi
Sakshi News home page

సమయపాలన

Mar 9 2026 12:09 AM | Updated on Mar 9 2026 12:09 AM

Ramalakshmi Sadanandam about Samayapalana

ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరిలో కనిపించే ఒకే ఒక ఉమ్మడి లక్షణం సమయపాలన. సమయాన్ని సరిగ్గా నిర్వహించే వ్యక్తి తన పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతాడు. ప్రకృతి కూడా సమయపాలననుపాటిస్తుంది. సూర్యోదయం, చంద్రోదయం, రుతువులు అన్నీ సమయానికే జరుగుతాయి. మనిషి కూడా ప్రకృతిని చూసి సమయపాలన నేర్చుకోవాలి. మనం పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తే, చివరి నిమిషంలో పడే కంగారు లేదా ఒత్తిడి ఉండదు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమయపాలన అనేది కేవలం గడియారం చూసి పని చేయడం కాదు, అది ఒక క్రమశిక్షణ.

సమయాన్ని గౌరవించడం అంటే సాక్షాత్తు భగవంతుడిని గౌరవించడమే. సమయాన్ని వృథా చేసేవాడు దైవనింద చేసినట్లే అని ఆధ్యాత్మిక భావన. ఒక వ్యక్తి సమయానికి వస్తున్నాడంటే, అతనికి తన బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉందని అర్థం. సమయపాలనపాటించకపోయినా, సద్వినియోగం వేసుకోకపోయినా ఏ మనిషి కూడా ఆలోచనలను, ఉన్నత లక్ష్యాలను యిప్పుడే కాదు, ఎప్పటికీ చేరుకోలేడు. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు. ఒకసారి సమయం దాటిపోయింది. అంటే తిరిగి దానిని అందుకోవడం మన వల్ల కాదు. అందుకనే ప్రతి క్షణం కూడా మనం మెలకువతో ఉండి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలిగితేనే విజయం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది.

మనం చేసే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. విత్తనం నాటడానికి ఒక సమయం, ఫలం రావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండటం (ఓర్పు), అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆధ్యాత్మిక లక్షణం. ఒక కార్యం తలపెట్టినప్పుడు ప్రణాళిక ఎంత ముఖ్యమో, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట సమయం కూడా అంతే ముఖ్యం. ఆ సమయ పరిపాలన మనంపాటించకపోతే ఆ కార్యం ఫలాలను మనం పూర్తిగా అందుకోలేం. సమయాన్ని నిరుపయోగంగా మొబైల్‌ ఫోన్లకే కేటాయించడం అనేది ఒక సామాజిక సమస్యగా మారుతోంది.

మొబైల్‌ అనేది ఒక అద్భుతమైన సాధనం అయినప్పటికీ, దానిని అతిగా వాడటం వల్ల యువత తమ విలువైన భవిష్యత్తును పణంగా పెడుతున్నారు యువత ఈ మొబైల్‌ మాయలో పడి తమలోని దైవత్వాన్ని కోల్పోతున్నారు. ఈ అనవసరపు యాప్‌ల నుండి బయటపడి, రోజులో కనీసం 15 నిమిషాలు మౌనంగా లేదా ధ్యానంలో గడిపితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో వారు గ్రహించ గలరు. మొబైల్‌ ఫోన్‌ మన అవసరానికి ఉండాలి కానీ, మనల్ని శాసించేలా ఉండకూడదు. యువత తమ కాలాన్ని కెరీర్‌ నిర్మాణానికి, జ్ఞానసముపార్జనకు వాడుకుంటేనే దేశానికి, వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విలువైన ఈ జీవిత పయనంలో సమయం విలువ నేటి యువత తెలుసుకోవాల్సిందే,పాటించాల్సిందే. లేకుంటే వారి జీవితాలు అధోగతిపాలుకావడం ఖాయం. 

ఎంత ప్రతిభ ఉన్నా సమయపాలనపాటించనపుడు అతని ప్రతిభ నిరుపయోగంగా మారిపోతుంది. ఏ సమయంలో అది అందించాలో తెలియనపుడు అతడు ఎంత నాణ్యమైన వస్తువు తయారుచేసినా నిరుపయోగంగా మారిపోతుంది. వీటన్నిటికీ కూడా సమయమే ముఖ్యం. ఈ సమయ పరిపాలన అనే మంత్రం మాత్రమే వారి ఆలోచనలను, లక్ష్యాలను, దీర్ఘకాలిక ప్రణాళికలను నెరవేర్చగలుగుతుంది. సమయం ఎంతో విలువైనది. ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారే పనులను విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఆ సమయం విలువను గుర్తించి దాన్ని అనుసరించగలిగితే ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవటానికి మార్గం సులభమైనట్లే. – రామలక్ష్మీ సదానందమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement