తెనాలి: కార్తిక వనసమారాధనలు సందడిగా నిర్వహించారు. మూడో ఆదివారం పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో వన సమారాధనలు ఘనంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, రాజకీయ ప్రముఖులు పాలుపంచుకున్నారు. శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘీయుల విజ్ఞాపనలకు సహకరిస్తామని హామీనిచ్చారు.
ఐకమత్యంతోనే అభివృద్ధి..
యాదవులు ఐకమత్యంగా పయనించాలని ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం చంద్ర వంశీయ క్షత్రియ యాదవ రాజుల 14వ కార్తిక వన సమారాధన వైభవంగా నిర్వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని యాదవ వర్గీయుడైన తోట దుర్గాప్రసాద్‌కు కేటాయించినట్లు గుర్తు చేశారు. యాదవ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ బీసీల ఎదుగుదలకు నాడు ఎన్టీఆర్, ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే తోడ్పాటునిచ్చినట్లు పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో యాదవులు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని, ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అంతా ఐకమత్యంగా, ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాగంటి సుధాకర్ యాదవ్, తాళ్ల వెంకటేష్ యాదవ్ సహా పలువురు యాదవ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వన సమారాధనకు దాదాపు పదివేల మంది హాజరయ్యారు. దానబోయిన ప్రసాద్, మేడిపోయిన గంగ యాదవ్, తట్టుకూళ్ల అశోక్ యాదవ్, కోటి యాదవ్, ఆరాధ్యుల శివాయాదవ్ తదితరులు రామచంద్ర యాదవ్‌ను భారీ గజమాలతో సత్కరించి, శ్రీకృష్ణుని ప్రతిమను అందజేశారు. కార్యక్రమంలో తాడిబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుక్కల వాసు, తుపాకుల రామకృష్ణ, దానబోయిన నరసయ్య, బొంత సాంబయ్య, కరేటి లక్ష్మీనారాయణ, జీవీ నారాయణ, గంపల శివ నాగేశ్వరరావు, మల్లెబోయిన రాము, హరికృష్ణ, కుక్కల రాజా, సమాధి మహేష్, మునగా శివ పాల్గొన్నారు.
అగ్నికుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో..
సమాజంలో అందరినీ ముందుకు తీసుకెళ్లాలనేది తమ ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అగ్నికుల క్షత్రియులంతా కలసికట్టుగా వ్యవహరించాలని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.తెనాలి అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ 6వ కార్తిక వనసమారాధన ఆదివారం స్థానిక బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళా సదనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అగ్నికుల క్షత్రియ సంఘీయులను అభినందించారు. వనసమారాధనలు నేడు కుల సమారాధనలుగా మారాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నేటి తరానికి బంధుమిత్రులు ఎవరో తెలుసుకునేందుకు, అనుబంధాలను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయని చెప్పారు. కార్యక్రమంలో సైకం లక్ష్మణరావు, కొక్కిలిగడ్డ అజయ్, సైకం పార్థసారథి, మైలా చెన్నకేశవరావు, రేవు రమణ పాల్గొన్నారు.
జై గౌడ, గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో..
గౌడ సంఘీయుల కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లటం అభినందనీయమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం జరిగిన జై గౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ, గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి కాటమయ్య 10వ కార్తిక వనసమారాధన, కౌండిన్య జయంతి ఉత్సవాల్లో మనోహర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానం నిర్మాత గౌడ అయినప్పటికీ ఆ వర్గీయులకు ఇంతకాలమైనా ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవి దక్కకపోవడం తనను ఆలోచింపజేసిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక వైకుంఠపురం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవిని వారికే ఇచ్చినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ తనను వెన్నంటి ఉంటున్న గౌడలంటే తనకెంతో అభిమానమని చెప్పారు. జైగౌడ్ ఉద్యమ కమిటీ నేతలు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, కాటం రవికుమార్ గౌడ్, వాకా అర్జున్ గౌడ్, వీరమల్లు కార్తిక్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్ పర్యవేక్షించారు.
పద్మశాలీయ బహూత్తమ ఆధ్వర్యంలో..
స్థానిక తెనాలి వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం శ్రీపద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన వైభవంగా నిర్వహించారు. మార్కండేయ మహా యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పద్మశాలీయ సంఘాల సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్, గట్టు బాల శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, దివి హేమంత్, కొడాలి క్రాంతి కుమార్ పాల్గొన్నారు.