సందడిగా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం
తణుకు అర్బన్: స్నేహితుడి గుర్తుగా ఏర్పాటైన డాక్టర్ పీఎన్‌ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ అద్భుతమని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్పం 2025 పేరుతో తణుకు కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంతమంది దివ్యాంగులను ఒక వేదికపైకి తీసుకువచ్చి వారికి వైద్యం, ఇతర సదుపాయాలను అందించేలా రూపొందించిన ఆత్మీయ సమ్మేళనం అభినందనీయమని అన్నారు. ఈ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుంచి సుమారుగా 5 వేలకు పైగా దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 విభాగాలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్యశిబిరాల్లో వైద్యులు దివ్యాంగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఫౌండేషన్ చైర్మన్ బొల్లా సతీష్‌కుమార్, వజావత్ కాన్‌రాజ్, షర్మిష్ట వీరన్న, సృష్టి సుబ్బారావు, సింహాద్రి కాశీ, గమిని మహీపాల్, నాగళ్ల వెంకటేశ్వరరావు, వేండ్ర లక్ష్మణ్, మానేపల్లి కాశీ, జగదీష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


