సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 11న జరిగే రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలి దశలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించినట్లు తెలిసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని(సీఏపీఎఫ్) రప్పించారు. పోలింగ్ రోజున బూత్‌ల వద్ద మూడు అంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన సీఏపీఎఫ్ సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు.
డేగ కళ్లతో పకడ్బందీ నిఘా
బిహార్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మొత్తం 1,650 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ నుంచి 1,332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. వీటిలో 208 కంపెనీలను 14 బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలించారు. ఇందులో 14,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ దళాలు సీఏపీఎఫ్ కమాండ్ కింద పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతకు నాయకత్వం వహిస్తాయి. అలాగే.. పోలింగ్ బూత్‌లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగకళ్లతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్ట భద్రత
బిహార్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సీఏపీఎఫ్ సిబ్బందిని రెండు విభాగాలుగా మోహరిస్తారు. పెద్ద బూత్‌లలో పూర్తిస్థాయి విభాగం అంటే.. ఎనిమిది మంది సాయుధ సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. ఇక తక్కువ మంది ఓటర్లు ఉన్న చిన్న బూత్‌లలో సగం విభాగం అంటే.. నలుగురు సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. అదనంగా బిహార్ హోంగార్డ్‌లు, దాదాపు 19వేల మంది ట్రైనీ పోలీసు సిబ్బంది, స్థానిక వాచ్‌మెన్‌లను కూడా పోలింగ్ స్టేషన్‌ల వద్ద మోహరించారు. వారిలో ఎవరినీ కూడా వారి సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించలేదు.
సీఐఎస్‌ఎఫ్‌కు స్ట్రాంగ్ రూమ్‌ల బాధ్యత
మొదటి దశ పోలింగ్ తర్వాత జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంను భద్రపరిచారు. రెండో దశ పోలింగ్ తర్వాత కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో కూడా సీఐఎస్‌ఎఫ్ బలగాలే భద్రతను పర్యవేక్షిస్తాయి. బిహార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని డీజీపీ కంట్రోల్ రూమ్ ఎన్నికలకు ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇక్కడ పర్యవేక్షణ కోసం ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలను నియమించారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్ సమయంలో మొత్తం 121 స్థానాల్లో ఓటింగ్‌ను ఇక్కడి నుండే నిశితంగా పరిశీలించారు. నవంబర్ 11న జరిగే రెండో దశకు కూడా ఇదే విధానం కొనసాగుతుంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించగా, అత్యవసర వినియోగం కోసం ఐదు అదనపు కంపెనీలను రిజర్వ్‌లో ఉంచారు.


