జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
భీమవరం: ఢిల్లీలో పేలుడు దృష్ట్యా జిల్లాలలో సోమవారం రాత్రి అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు. సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో తనిఖీలు నిర్వహించి, కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను పరిశీలించారు. కార్గో సర్వీస్ సెంటర్‌లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి, పార్శిళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు.అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఏవైనా దృష్టికి వస్తే, తక్షణం డయల్ 112కు గానీ, స్థానిక పోలీసు స్టేషన్‌న్‌కు గానీ సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పరిశీలించారు. కార్తీకమాసం 3వ మంగళవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ క్యూలైన్‌లు, మంచినీటి సౌకర్యం, వైద్యశిబిరం, పార్కింగ్ ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ ప్రదేశం తదితర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని పోలీసు, ఆలయ సిబ్బందికి సూచించారు.
పాలకొల్లు సెంట్రల్: సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి ఆ ఫోన్ నెంబరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి.. రూ.29 వేలు దోచుకున్నారు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వై.మాధురి సెల్‌పోన్ హ్యాకయ్యింది. అయితే ఆమె నెంబరుతో డబ్బులు పంపమని వాట్సప్ ద్వారా ఆమె స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు సమాచారం పంపించారు. తన ఫోన్ హ్యాక్ అయిన విషయం మాధురి తెలుసుకుని సంబంధిత వ్యక్తులకు సమాచారం పంపించేలోపు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు రూ.29 వేలు సైబర్ నేరగాడు ఇచ్చిన నెంబర్‌కు పంపారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ మాధురి పోలీసులను ఆశ్రయించి ఫోన్ నెంబరును బ్లాక్ చేయించి.. అనంతరం సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు.
ఉంగుటూరు: ప్రభుత్వం తప్పడు నిర్ణయాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. సోమవారం రాత్రి నారాయణపురం దళితవాడలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం అసంబద్ధమని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసి పెట్టుబడిదార్లకు కట్టపెట్టాలని చూడడడం ఎంతవరకు సమంజసమన్నారు. పేద ప్రజల గోడు పట్టదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయం వల్ల వైద్య విద్య, వైద్యం పేదప్రజలకు దూరమవుతందని అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వాసుబాబు ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మరడ మంగారావు, జెడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మంద జయలక్ష్మి, పెనుగొండ బాలకృష్ణ, పుప్పాల గోపి, బండారు నాగరాజు, దొంతంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


