భక్తప్రభం‘జనం’
అన్నవరం: కార్తిక మాసం మూడో ఆదివారం రత్నగిరి భక్తజనప్రభంజనమే అయ్యింది. వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా మారిపోయింది. రికార్డు స్థాయిలో సుమారు 90 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. వ్రత మండపాలు ఖాళీ లేకపోవడంతో భక్తులను కంపార్ట్‌మెంట్లలోనే గంటల తరబడి నిలిపివేశారు. వ్రత మండపాలు ఖాళీ అయ్యాక వారిని లోపలకు అనుమతించారు.
దండిగా ఆదాయం
భక్తుల ద్వారా దేవస్థానానికి ఈ ఒక్క రోజే రూ.కోటి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దీనిలో వ్రతాల ద్వారానే సుమారు రూ.55 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.15 లక్షల చొప్పున వచ్చింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆలయంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 15 వేల మంది భక్తులకు ఉచితంగా పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. కార్తిక సోమవారం పర్వదినం కావడంతో రత్నగిరిపై నేడు కూడా తీవ్ర రద్దీ నెలకొనే అవకాశముంది. సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో వ్రతాలు
రికార్డు స్థాయిలో సత్యదేవుని వ్రతాలు 9 వేలు జరిగాయి. వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి వ్రతాలు జరిగాయి. కార్తిక పౌర్ణమి నాడు 10 వేల వ్రతాలు జరగగా ఆ తరువాత అత్యధిక వ్రతాలు జరిగింది ఇప్పుడేనని అధికారులు చెప్పారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. రామాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, జమ్మి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండిపోయింది.
ఫ కిటకిటలాడిన రత్నగిరి
ఫ సత్యదేవుని దర్శించిన 90 వేల మంది
ఫ 9 వేల వ్రతాల నిర్వహణ
ఫ రూ.కోటి ఆదాయం
భక్తప్రభం‘జనం’
భక్తప్రభం‘జనం’
భక్తప్రభం‘జనం’


