మనోవేదనతో యువకుడి ఆత్మహత్య
కాకినాడ క్రైం: ప్రేమలో మనస్పర్థల కారణంగా మనోవేదనకు గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కాకినాడ జగన్నాథపురానికి చెందిన దండుప్రోలు రాజు (21) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. స్థానిక నరసింహరోడ్డు పూర్వంవారి వీధిలో ఉంటున్న నాయినమ్మే రాజును పెంచి పోషించింది. కొన్నాళ్ల పాటు వెల్డర్‌గా పనిచేసి, ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన దుస్తుల దుకాణంలో పనిచేసే ఓ యువతితో రాజు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సఖ్యంగా ఉన్న వీరివురి మధ్య కొన్నాళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ తగాదాలతో రాజు పది రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కుటుంబీకులు సకాలంలో స్పందించి ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాలతో బయటపడ్డాడు. రాజు కోలుకుంటే కోటిపల్లి దేవాలయానికి వచ్చి మొక్కు చెల్లించుకుంటామని నాయినమ్మ, అత్తలు శివుడికి మొక్కుకున్నారు. గండం గట్టెక్కి ప్రాణాలు నిలవడంతో, సోమవారం ఉదయం మొక్కు తీర్చుకోవాలని కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. రాజును ఇంట్లో వదిలి నాయినమ్మ, అత్తలు కోటిపల్లి క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం మొక్కు చెల్లించుకుని వచ్చే సరికి ఇంటి తలుపు వేసి ఉంది. ఎంత కొట్టినా తీయకపోవడంతో కిటికీ నుంచి చూస్తే రాజు విగతజీవిగా దూలానికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో తలుపు తెరిచి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు కాకినాడ జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. ప్రేమించిన యువతితో గొడవల కారణంగా వేదనను తాళలేక రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించి, తుది ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


