నైపుణ్యాలతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
విద్యారణ్యపురి: నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకట్‌రెడ్డి అన్నారు. వృత్తివిద్యలో శిక్షణ పొందిన యువతకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2015 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన వృత్తి విద్యాకోర్సులను 2030 వరకు అన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వృత్తివిద్యా కో–ఆర్డినేటర్ బి.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. వృత్తివిద్యతో యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. అధ్యక్షత వహించిన మర్కజీ హైస్కూల్ హెచ్‌ఎం రామారావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు ఆన్‌లైన్‌లో 1,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 682 మంది హాజరైనట్లు తెలిపారు. 24 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 214 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. కాస్మోటిక్ కంపెనీలు, అపోలో ఫార్మసీ, రిటైల్ షాపుల్లో వీరు పనిచేయనున్నారు. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బి.మన్మోహన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఇంచార్జ్ ఎంఈఓ జగన్నాథం పాల్గొన్నారు.
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి


