సాహితీ లోకానికి తీరని లోటు
నా కవితా సంపుటిని ఆవిష్కరించారు..
గత ఏప్రిల్‌లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘నాతో నేను.. నీతో నేను’ అనే కవిత్వ సంకలనాన్ని అందెశ్రీ ఆవిష్కరించారు. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం సంతోషాన్నిచ్చింది. ఆప్యాయంగా పలకరించే స్వభావం, ఆయన పాటలు మనిషిని తట్టిలేపుతా యి. గళం విప్పిన చాలు సభా ప్రాంగణం నిశ్శబ్దం.. ఆకట్టుకునే ఉపన్యాసం ఆయనకే సొంతం. అందెశ్రీ గళం ఉద్యమ స్ఫూర్తి ఎలుగెత్తుతూనే ఉంటుంది.
– కొత్తపెల్లి రాధికనరేన్, కవయిత్రీ,
ఉపాధ్యాయురాలు, వరంగల్
దామెర : ప్రజాకవి, రచయిత అందెశ్రీ మరణం కళాకారులకు తీరనిలోటు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి వందల ధూంధాం వేదికలను పంచుకోవడం మర్చిపోని గుర్తులు. తెలంగాణ కళా శిఖరం నెలకొరిగినా ముక్కోటి గొంతులకను ఒక్కటి చేసిన రాష్ట్ర గీతం తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయం. మాయమై పోతున్నడమ్మ, చూడాచక్కనితల్లి, జన జాతరలో మనగీతం, కొమ్మ చెక్కితె బొమ్మరా–కొలిచి మొక్కితె అమ్మరా వంటి గొప్ప పాటలు రాసిన సహజ కవి అందెశ్రీ. పాటతోనే డాక్టరేట్ పొందిన మహనీయుడు. – వరంగల్ శ్రీనివాస్, సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు
అందెశ్రీ మృతిపై ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులు, రచయితల సంతాపం
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ మనుషులను, సమాజాన్ని ఆలోచింపజేసి ప్రజాజీవితాన్ని తన గొంతుతో వినిపించి, తన పాటలు, రచనల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన ప్రజాకవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటనతో వరంగల్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుని సంతాపం తెలిపారు. ఆయనతో అనుబంధం మరవలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అందెశ్రీ మృతి సాహితీ రంగానికి తీరని లోటన్నారు. అందెశ్రీ రచనలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాయన్నారు.
– హన్మకొండ కల్చరల్


