భస్మోధూలిత రుద్రుడిగా రుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీకమాసంలోని మూడో సోమవారం రుద్రేశ్వరస్వామివారు భస్మోధూలిత రుద్రుడిగా దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఋగ్వేద పండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉత్తిష్ట గణపతికి నవరసాభిషేకం, ఆరాధన మహరుద్ర శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. అనంతరం రుద్రేశ్వరున్ని 51 కిలోల భస్మంతో అభిషేకం నిర్వహించి భస్మోధూలిత రుద్రుడిగా అలంకరించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. ప్రదోషకాల సమయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. శివ ప్రీతికరమైన సోమవారం కావడంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.


