బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడి దుర్మరణం
ఆలేరు: బైక్‌పై వెళ్తున్న యువకుడిని అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలేరు – రఘునాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది వారం తెల్లవారుజామున జరిగింది. సీఐ యాలా ద్రి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎర్ర మాతమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఆలేరు మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. మాతమ్మ చిన్న కుమారుడు ఉదయ్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఉదయ్ ప్రతిరోజు తెల్లవారుజామున మాతమ్మను బైక్‌పై ఎక్కించుకుని ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద దించుతాడు. అక్కడ మాతమ్మ అటెండెన్స్(బయోమెట్రిక్) ప్రక్రియ పూర్తికాగానే ఆమెకు పని కేటాయించిన ప్రాంతంలో వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. రోజుమాదిరిగా ఆదివారం తెల్లవారుజామున కూడా ఉదయ్ ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయంలో తన తల్లి బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమెను రైల్వే గేట్ చౌరస్తాలో వదిలి తిరిగి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఆలేరు–రఘనాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదకు చేరుకోగానే.. అదే సమయంలో రఘునాథపురంలోని అత్తగారింటికి వచ్చిన తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యాపారి హరిరామకృష్ణన్ తన భార్య, కుమార్తెతో కలిసి కారులో ఆలేరు వైపు వెళ్తూ అదుపుతప్పి ఉదయ్ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఉదయ్ బైక్ పైనుంచి ఎగిరి ఫ్లైఓవర్ కింద రోడ్డు పైన పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే ఉదయ్ మృతిచెందాడు. కారు ఫ్లైఓవర్ పైన ఫుట్‌పాత్ మీదకు ఎక్కి ఆగింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో హరిరామకృష్ణన్, అతడి భార్య, కుమార్తె సురక్షింతగా బయటపడ్డారు. అతివేగంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు సీఐ యాలాద్రి చెప్పారు. మృతుడి సోదరుడు ఉమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి సుమారు రూ.3.50లక్షల పరిహారం చెల్లించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది.


