12న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి
పట్నంబజారు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బూత్ కమిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. మల్లికార్జునరావుపేటలోని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేసే దిశగా దిక్కుమాలిన నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. దీనిపై కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. భావితరాల భవిష్యత్తుకు దిక్చూచీగా మారనున్న వైద్య కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో మన సంతకం మన బాధ్యత అనే విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో బూత్ కమిటీ జిల్లా నేతలు, ఆయా నియోజకవర్గాలు, మండల నేతలు పాల్గొన్నారు.
పర్చూరు(చినగంజాం): మృతి చెంది ఆస్పత్రిలో దిక్కులేకుండా పడి ఉన్న వ్యక్తి శవాన్ని వారి బంధువులకు అప్పగించి దహన సంస్కారాలకు పర్చూరు ఎస్‌ఐ జీవీ చౌదరి సాయమందించారు. నూతలపాడుకు చెందిన చీరాల శ్రీనివాసరావు జ్వరంతో బాధపడుతుంటే అతని కుమారుడు సురేష్‌బాబు చికిత్స కోసమై పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి కనిపించకుండా వెళ్లిపోయాడు. అటు తరువాత ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు చనిపోయాడు. దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న ఎస్‌ఐ అవసరమైన సహాయ సహకారాలు అందించారు.


